E-PAPER

రాజ్యసభలో వికలాంగులకు అవకాశం కల్పించాలి: సీఎం చంద్రబాబుకు గిద్దె రాజేష్ విజ్ఞప్తి

సూర్యాపేట :
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో కనీసం రెండు స్థానాలను వికలాంగులకు కేటాయించి, వారి రాజకీయ సాధికారతకు మార్గం సుగమం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు.

శనివారం సూర్యాపేట జిల్లా తిమ్మారెడ్డిగూడెంలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న గిద్దె రాజేష్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేల పెన్షన్, ఇతర వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అలాగే “ఇంద్రధనస్సు” పేరుతో ఏడు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించడాన్ని సమితి తరఫున అభినందించారు.

అయితే సంక్షేమ పథకాలతో పాటు వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం కూడా అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడిచినా చట్టసభల్లో వికలాంగులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారి సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం కావడం లేదన్నారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్ల మాదిరిగానే రాజకీయ రంగంలోనూ ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే వికలాంగులు సకలాంగులతో సమానంగా అభివృద్ధి చెందగలరని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ వేదికలపై వికలాంగుల సమస్యలను సమర్థవంతంగా వినిపించాలంటే వికలాంగుల ప్రతినిధులే చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో వికలాంగులకు అవకాశం కల్పిస్తే రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గిద్దె రాజేష్ పేర్కొన్నారు.

మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర నాయకుడు కడియ నరేష్, జిల్లా అధ్యక్షుడు పసుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News