అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో గాజా కోసం రూపొందించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకారం తెలపలేదు. అమెరికా ప్రతిపాదనను తాము ఆమోదించలేదని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరిస్తేనే గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లేలా హామీలు ఉన్నప్పటికీ, ఈ ప్రణాళికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో నెతన్యాహు ఈ అంశంపై స్పందించారు. ట్రంప్ బృందం హమాస్‌ను నిరాయుధీకరించడంతో పాటు గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చడం సాధ్యమవుతుందని భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నుంచి తమకు ఓ ముసాయిదా అందిందని, దానిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని తెలిపారు.
అయితే ఆ ముసాయిదాను తాము అంగీకరించలేదని నెతన్యాహు స్పష్టం చేశారు. అది ఇజ్రాయెల్ రూపొందించిన ప్రణాళిక కాదని, తమ అభిప్రాయాలు, సూచనలను అమెరికా బృందానికి ఇప్పటికే పంపించామని వెల్లడించారు. దీంతో గాజా విషయంలో ట్రంప్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ నుంచి మరిన్ని మార్పులు కోరుతున్నట్లు స్పష్టమవుతోంది.








