ప్రకృతి ప్రకోపించినప్పుడు కనీసం వాతావరణ సమాచారం కూడా అందని పరిస్థితుల్లో ఉపగ్రహాల సాయంతో ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేశాడు హైదరాబాద్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థి ఆగమ్ జైన్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా వాతావరణ ఉపగ్రహాల నుంచి మేఘాల చిత్రాలను నేరుగా అందుకునే పరికరాన్ని రూపొందించి తన ప్రతిభ చాటుకున్నాడు.
నెట్‌వర్క్ అవసరం లేని పరికరం
ఆగమ్ రూపొందించిన ఈ పరికరానికి ‘సమ్మిట్‌సాథి’ అని పేరు పెట్టాడు. సాధారణంగా వాతావరణ వివరాలు తెలుసుకోవడానికి ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ హిమాలయాల్లోని మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ సేవలకు అంతరాయం కలుగుతుంది. కొన్నిసార్లు రహదారులు దెబ్బతినడంతో పాటు సమాచార వ్యవస్థలు కూడా పనిచేయవు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మిట్‌సాథి ద్వారా ఉపగ్రహాల నుంచి మేఘాలకు సంబంధించిన చిత్రాలను నేరుగా పొందవచ్చు.
పది గ్రామాలకు మూడు పరికరాలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సెరాజ్ లోయ పరిధిలో పది గ్రామాలకు ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని ప్రాజెక్టు బృందం భావిస్తోంది. ఇందుకోసం మూడు రిసీవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని నిర్వహించేందుకు ముగ్గురు స్థానికులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ఒక్కో పరికరం తయారీకి సుమారు రూ.68 వేలు ఖర్చవుతోంది.
వాతావరణ హెచ్చరికలకు ప్రత్యామ్నాయం కాదు
ఈ పరికరం సామర్థ్యంపై బృందం స్పష్టత ఇచ్చింది. సమ్మిట్‌సాథి ఆకస్మిక భారీ వర్షాలను ముందుగానే అంచనా వేయలేదు. అలాగే ప్రభుత్వ వాతావరణ శాఖలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలు, అత్యవసర సమాచారానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. ఉపగ్రహ చిత్రాల ద్వారా వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు అదనపు సమాచార వనరుగా మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
ఇతర రంగాల్లోనూ పరిశోధనలు
ఆగమ్ జైన్ ఆసక్తి ఈ ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కాలేదు. ఖగోళ శాస్త్రం, పర్యావరణ అధ్యయనాల్లోనూ స్వతంత్రంగా పరిశోధనలు చేస్తున్నాడు. పాఠశాల విద్యను అభ్యసిస్తూనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఉపయోగపడే పరిష్కారాన్ని రూపొందించడం అతడి ఆలోచనా పరిణతికి నిదర్శనం.








