‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఏకకాలంలో రెండు యూనిట్లు పనిచేస్తున్నాయని సమాచారం. గండిపేట పరిసరాల్లో మెయిన్ యూనిట్ ప్రభాస్‌తో పాటు కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు రెండో యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచేలా హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రెండు యూనిట్లతో ఏకకాలంలో షూటింగ్ జరుపుతుండటంతో సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తవుతున్నట్లు సమాచారం.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








