ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహిస్తారు. నవజాత శిశువుకు తల్లిపాలు అత్యుత్తమ పోషకాహారంగా భావిస్తారు. అయితే బిడ్డకు సరిపడా పాలు వస్తున్నాయా అనే సందేహం ముఖ్యంగా తొలిసారి తల్లులైన మహిళల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ సరైన అవగాహన కల్పించడం ఈ వారోత్సవం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.
ప్రసవం తర్వాత తొలి రోజుల్లో కొంతమంది తల్లులకు తగినంత పాలు ఉత్పత్తి కావడం లేదా బిడ్డకు సరిగ్గా పట్టించడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. బిడ్డకు తరచుగా పాలు ఇవ్వకపోవడం, రొమ్మును సరిగ్గా పట్టుకోలేకపోవడం (Poor Latch), ఒత్తిడి, కొన్ని ఆరోగ్య సమస్యలు, సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఇందుకు దోహదపడవచ్చు. అయితే చాలా సందర్భాల్లో ఇవి తాత్కాలిక సమస్యలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సరైన పద్ధతిలో బిడ్డకు తరచుగా తల్లిపాలు ఇవ్వడం, బిడ్డ రొమ్మును సరిగ్గా పట్టుకునేలా చూసుకోవడం, అవసరమైతే వైద్యులు లేదా లాక్టేషన్ నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. బిడ్డకు పాలు సరిపోతున్నాయా అనే విషయంలో అనుమానం ఉంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.








