E-PAPER

బెంగాల్‌లో విచిత్రమైన ఘటన..! సొరంగం తవ్వి పారిపోయిన ఆడపులి..

పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్ పునాది కింద సొరంగం తవ్వి మూడేళ్ల ఆడపులి చాకచక్యంగా తప్పించుకుంది. అసోం నుంచి తిరిగి తీసుకొచ్చిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంతో అటవీ అధికారులు విస్మయానికి గురయ్యారు.

బెంగాల్‌లో పులుల సంఖ్యను పెంచే ప్రాజెక్టులో భాగంగా బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ నుంచి ‘టీ-138’ (బీటీఆర్-టీఎఫ్1) అనే ఆడపులిని తీసుకొచ్చారు. అక్టోబర్ 2న బుక్సాలోని 25వ మైలు వద్ద ఉన్న 2.2 హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో దీనిని విడిచిపెట్టగా, అక్టోబర్ 4నే బయటపడి సంకోష్ నది దాటి అసోంలోని రైమోనా ప్రాంతానికి వెళ్లిపోయింది. అనేక రోజులు శ్రమించి, చివరకు నవంబర్ 3న మత్తుమందు ఇచ్చి పట్టుకుని మళ్లీ బుక్సా ఎన్‌క్లోజర్‌కు చేర్చారు.

అయితే, ఆ పులి ఎన్‌క్లోజర్ ఫెన్సింగ్ పునాది కింద మట్టిని సొరంగంలా తవ్వి బయటకు జారుకుంది. ప్రస్తుతం అది బాలా నదిని దాటి తూర్పు వైపుగా అసోం దిశగా వెళ్తున్నట్లు తెలిసింది. గతంలో వెళ్లిన మార్గంలోనే ప్రయాణిస్తే జయంతి, రైడక్, సంకోష్ నదులను దాటి అసోం లేదా భూటాన్ అడవుల్లోకి ప్రవేశించే అవకాశముంది.

సాధారణంగా కుక్కలు లేదా హైనాల మాదిరిగా పులులు నేలను లోతుగా తవ్వలేవని, ఎన్‌క్లోజర్ పునాది పటిష్ఠంగా నిర్మించి ఉంటే ఇలా జరిగేది కాదని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాజీ శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ఎన్‌క్లోజర్ నిర్మాణ నాణ్యత, భద్రతా లోపాలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!