పలాస, జూన్ 6 (Y7 News):
ఉద్దాన ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ కోసం సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, న్యూ డెమోక్రసీ నాయకుడు వంకల మాధవరావు విమర్శించారు.
కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో సాగుభూములను బలవంతంగా భూసేకరణ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. భూసేకరణ ప్రక్రియలో రైతులు, స్థానిక ప్రజలపై పోలీసులు విధిస్తున్న నిర్బంధ చర్యలను కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.ప్రజల జీవనాధారమైన సారవంతమైన భూములను కోల్పోయే విధంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని వారు స్పష్టం చేశారు. రైతులు, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీపీఎం, న్యూ డెమోక్రసీ నాయకులు హెచ్చరించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.








