వై 7 న్యూస్ పలాస | మే 27
CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచన
ప్రజల మొబైల్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ శ్రీకాకుళం జిల్లా పోలీసులు మరోసారి సమర్థవంతమైన సేవలను అందించారు. పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించే కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ మరియు ఐటీ సెల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
గత నాలుగు నెలల కాలంలో సుమారు రూ.1 కోటి విలువైన 518 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్పీ స్వయంగా బాధితులకు మొబైల్ ఫోన్లను అందించారు.
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా పోలీసులు 2024లో 622, 2025లో 1060, 2026లో 518 మొబైల్ ఫోన్లు కలిపి మొత్తం 2200 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.70 కోట్లు ఉంటుందని తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విశ్లేషించి, ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాల్లో ఉన్న మొబైల్ ఫోన్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకోవడం విశేషమని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేసుకోవాలని సూచించారు. మొబైల్ వివరాలతో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని తెలిపారు. అలాగే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని, లేదంటే ఆ ఫోన్లను సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మొబైల్ ఫోన్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో విశేష ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్, ఐటీ సెల్ అధికారులు, సీసీఎస్ సిబ్బంది, శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు సంబంధిత స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ, అతి తక్కువ సమయంలో ఫోన్లను రికవరీ చేసి అందించిన జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సూర్య చంద్ర మౌళి, పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ మరియు ఐటీ సెల్ సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.








