E-PAPER

ఆదివాసీలపై బెదిరింపులు ఆపాలి ; కణితి రజిని

ఖబర్దార్ అని బెదిరిస్తున్న గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి – కణితి రజిని

చర్ల ఏప్రిల్ 02 (వై 7 న్యూస్ ): భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండల ఆదివాసీలకు వారి ప్రాంతంలోని సహజ వనరులపై పూర్తి చట్టబద్ధ హక్కులు ఉన్నాయని ఆదివాసి నాయకురాలు రజిని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా రజిని మాట్లాడుతూ ముఖ్యంగా పేసా (PESA) చట్టం 1996 ప్రకారం గ్రామ సభకు ఇసుక వనరులపై నిర్ణయాధికారం ఉందని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక క్వారీల నిర్వహణ గిరిజన సొసైటీలకే అప్పగించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, గిరిజనేతర కాంట్రాక్టర్లు అక్రమంగా జోక్యం చేసుకుంటూ పరిస్థితులను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. పచ్చని పల్లెల్లో శాంతియుతంగా జీవిస్తున్న ఆదివాసీల మధ్య విభేదాలు సృష్టిస్తూ, ముఖ్యంగా మహిళా ఇసుక సొసైటీలను లక్ష్యంగా చేసుకుని వివాదాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో చర్ల మండలంలో ఇసుక ర్యాంపుల విషయంలో ఉద్రిక్తతలు అధికమయ్యాయని, కొంతమంది గిరిజనేతరులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆదివాసీలను తప్పుదారి పట్టిస్తూ, వారి మధ్యే గొడవలు పెంచుతున్నారని పేర్కొన్నారు. వారి ప్రలోభాలకు లోనై కొందరు ఆదివాసీలు కూడా తమ సమాజానికే విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితులు ఎంత వరకు దిగజారిపోయాయంటే, అన్నదమ్ముల మధ్య, అక్కతమ్ముళ్ల మధ్య కూడా విభేదాలు పెరిగి, కుల పెద్దలు కూడా కుల బహిష్కరణలకు వెనుకాడని స్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది మొత్తం ఆదివాసి సమాజ అభివృద్ధికి తీవ్ర అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. అందువల్ల, సోషల్ మీడియా ద్వారా గానీ, ప్రత్యక్షంగా గానీ ఆదివాసీలను బెదిరిస్తున్న గిరిజనేతరులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఆదివాసీలు ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకుని ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. చట్టబద్ధంగా నడుస్తున్న ఆదివాసీ ఇసుక రీచులను అడ్డుకునే గిరిజనేతరులను గ్రామాల్లో తిరగనీయకుండా సమాజం ఒక్కటై ముందుకు రావాలని సూచించారు.

“మన ఊరు – మన అభివృద్ధి” అనే నినాదంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, గిరిజనేతరులు తమ వైఖరి మార్చుకొని ఆదివాసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. లేనిపక్షంలో ఆదివాసి సమాజం తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News