దుమ్మగూడెం మండలంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై మండల సర్పంచులు స్పందించారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మట్టా వెంకటేశ్వరావు అధ్యక్షతన సర్పంచులందరూ బాధిత ప్రాంతాలను సందర్శించి, అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు.
పైదాకులమడుగు, వర్షరాముడు గ్రామం, రామచంద్రపురం గ్రామానికి చెందిన కల్లూరి బుచ్చమ్మ, కల్లూరి వెంకటమ్మ, మహాదేవపురం గ్రామానికి చెందిన పూసం పొత్తయ్య కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బాధితులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.20,000 ఆర్థిక సాయం అందజేశారు.
ఇక బాధితులకు రెండో విడతగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గత 20 రోజులలో ఇదే మూడో అగ్ని ప్రమాదం కావడం గమనార్హం. నియోజకవర్గంలో ఎక్కువగా దుమ్మగూడెం మండలంలోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, మండలంలోనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని సర్పంచులందరూ డిమాండ్ చేశారు.
ఈ విషయంపై మండల సర్పంచులు తీర్మానం చేసి ఎమ్మెల్యే గారికి అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచులందరూ పాల్గొన్నారు.








