వై7 న్యూస్ పలాస;
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, మున్సిపాలిటీ ప్రథమ చైర్మన్ వజ్జ బాబూరావు నియమితులయ్యారు.ఈ సందర్భంగా పలాస మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో వజ్జ బాబూరావు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు, త్యాగాలు అనిర్వచనీయమని కొనియాడారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం కార్మికుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రజలందరి బాధ్యత అని పేర్కొన్నారు. పారిశుధ్యం పై అవగాహన పెంచడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అందరం కలిసి కృషి చేస్తే పలాస మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తుందని, స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సప్ప నవీన్, కొరికాన శంకర్, డొక్కరి శంకర్, యవ్వారి మోహనరావు మాస్టర్, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.








