వై7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. 2009 ఎన్నికలకు ముందు జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అవి 10కు తగ్గాయి. ప్రస్తుతం జిల్లా విభజన అనంతరం శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిధిలో ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ 12 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేకంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి, ఆమదాలవలస, ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా ఈ మార్పులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. జనాభా, భౌగోళిక పరిస్థితులు, పరిపాలన సౌలభ్యం వంటి అంశాల ఆధారంగా భవిష్యత్తులో నియోజకవర్గాల సంఖ్య పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.








