E-PAPER

ప్రభుత్వ బడులు నిలబడాలి- చదువుల్లో అంతరాలు పోవాలి

పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

తూప్రాన్ జూన్, 7 వై7 న్యూస్

ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ పౌర స్పందన వేదిక ప్రచార జాతా రెండో విడత మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్)మెదక్ జిల్లా కమిటీ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి తూప్రాన్ పట్టణంలోని బస్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అంతరాలు లేని చదువులకై అందరం మాట్లాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ చదువుల్లో మార్పు రావాలి. ఉన్నోడి పిల్లలైనా, లేనోడి పిల్లలైనా ఒకే బడిలో, ఒకే కళాశాలలో, ఒకే యునివర్సిటీలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌర స్పందన వేదిక పనిచేస్తుందన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు,కళాశాలలు,యునివర్సిటీలు బడుగుల పిల్లల కొరకే అన్న చందంగా మారింది. చదువును ఎంత పెట్టి కొనగలిగే వారికి, అంత ఫీజుతో ప్రైవేటు రంగములో బడులు/కళాశాలలు/యునివర్సిటీలు వచ్చాయి. ఎంత డబ్బు ఫీజుగా చెల్లించగలిగితే అంత గొప్ప చదువులు లభిస్తాయనే ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారము, తల్లిండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అధికాదాయ వర్గాలకు ఈ విధానము తమ ఆర్ధిక హెూదాను (దర్జాను) చూపించుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. మధ్యతరగతి తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా మారి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్చలేక, ప్రైవేటు ఫీజులతో అప్పులపాలవుతున్నారు. దిగువ తరగతి తల్లిదండ్రులు ప్రైవేటు దిక్కు చూడలేక, 77 ఏండ్ల స్వతంత్ర భారతములో మా బ్రతుకులు ఇంతేనని ప్రభుత్వబడులలో కళాశాలల్లో యునివర్సిటీలలో తమ పిల్లలను చేర్చిస్తున్నారు. టీఎస్ యుటిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చి 75 ఏండ్లు దాటింది. “భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగము ద్వారా పాలన చేసుకొని భారత సమాజములో గల ఆర్థిక, సామాజిక అంతరాలను క్రమంగా తగ్గించుకుంటామని 1950 జనవరి 26న అనుకున్నాము.” ఆచరణలో చూస్తే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గకపోగా, ఈ అంతరాలను సుస్ధిరం చేయడానికి తోడ్పడే విధంగా చదువుల్లోనే అంతరాలు సృష్టించగలిగిన ఘనత స్వాతంత్ర్య భారతంలో సాధించగలిగాము. ఎందుకిలా జరిగింది. చదువులపట్ల ప్రజలకున్న నిర్లిప్తత. ప్రజాసమూహాలను చైతన్యపరిచే నోరున్నవారు తమ పిల్లలను ఏదో రకంగా ప్రైవేటులో చదివించుకోవటం, ప్రభుత్వ బడి, కళాశాల, యునివర్సిటి బాగు కొరకు మాట్లాడకపోవటం, కార్యాచరణ చేయకపోవటం వల్లనే ఈ స్థితికి చేరింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి చైర్మన్ గా, ఇంకనూ ముగ్గురు సభ్యులతో “తెలంగాణ విద్యా కమిషన్” నియమించారు. ఈ కమిషన్ ఫిబ్రవరి 2025లో పాఠశాల విద్యలో తీసుకురావలసిన మార్పుల గురించి 21 పేజీల రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు వెలుగులో ఈ క్రింది చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 1. బడి ఈడు పిల్లల సంఖ్య ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో పాఠశాలల్ని ” రీ-ఆర్గనైజ్” చేయాలి. ఇతర ఆవాసాల నుండి బడికి రావలసిన విద్యార్థుల కొరకు ఉచిత బన్ సౌకర్యం కల్పించాలి. 2. గ్రేటర్ హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మెదక్ వంటి నగరాలలో మరియు ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ వంటి పట్టణాలలో ప్రభుత్వం కొత్త బడులు ఏర్పాటు చేయాలి. 3. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయాలి. తరగతికొక గది, తరగతికొక ఉపాధ్యాయుడు మరియు ప్రధానోపాధ్యాయులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. 4. కేంద్ర ప్రభుత్వము కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ఏర్పాటుకు కేంద్రం 5000 కోట్లు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలి. 5. ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసిన ఎయిడెడ్ పాఠశాలల్ని ప్రభుత్వము స్వాధీనము చేసుకొని, ప్రభుత్వ పాఠశాలలుగా నిర్వహించాలి. 6. క్రమంగా అంతరాలు లేని బదులను అభివృద్ధి చేసి, ఉన్నోడి పిల్లలైనా, లేనోడి పిల్లలైనా ఒకే బడిలో, ఒకే తరగతి గదిలో చదువుకునే పరిస్థితులు కల్పించాలి.
అంతరాలు లేని చదువులకై అందరూ మాట్లాడాలని, కార్యాచరణలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామనీ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఎస్వీ ఉపాధ్యక్షులు మంగ, దణమూర్తి,టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి , టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పద్మారావు, ఉపాధ్యక్షులు కవిత, భీమ్లా నాయక్, సుధాకర్, కనకరాజు, యేసయ్య, భూషణం, శ్రీనివాస్, డాక్య, వాసురం, కేవీఆర్ నాయుడు, యాదయ్య, నర్సింలు, గణేష్, ప్రభాకర్, ప్రేమాకుమార్, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News