పాల్వంచ,ఫిబ్రవరి23 వై 7 న్యూస్
పాల్వంచ పట్టణంలో ఇటీవల హోల్సేల్ దుకాణంలో సుమారు రూ. 26 లక్షల విలువ చేసే సిగరెట్ల దొంగతనం జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కేసును సవాలుగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు శనివారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సతీష్ వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ కు చెందిన నలుగురు వ్యక్తులు అశోక్, గణపతి, సునీల్, మనీష్ ఈజీ మనీకి అలవాటుపడి దొంగతనానికి పాల్పడ్డారు. అశోక్ అనే వ్యక్తి పాల్వంచ పట్టణంలో గతంలో కిరాణ షాప్ లో పని చేసేవాడు.ఇక్కడి వ్యాపారాలపై అవగాహన ఉండటంతో వారి స్నేహితులకు సమాచారం అందించి వారితో పాటు ఒక వాహనం తీసుకొని ఈనెల 3న తెల్లవారుజామున దొంగతనం చేశారు. సుమారు ఇరవై ఆరు లక్షల విలువచేసే సిగరెట్ల ను తీసుకు వెళ్లి హైదరాబాద్ బోయినపల్లిలో వ్యాపారం చేస్తున్న రాజస్థాన్ కి చెందిన వ్యక్తి గణపతి ప్రజాపతికి విక్రయించారు. అశోక్, మనీష్ సరుకు కొనుగోలు చేసిన గణపతి ప్రజాపతిని అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తి వివరాలు వెల్లడించారు. మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పాల్వంచ రెండవ ఎస్సై రాఘవయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









