E-PAPER

బొడ్డపాడులో పి.ఓ.డబ్ల్యు కరపత్ర ఆవిష్కరణ.. మహిళా రిజర్వేషన్, ఉపాధి హామీ పథకం అమలుకు డిమాండ్

పలాస, జూన్ 13 (వై7 న్యూస్): ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో శనివారం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఎటువంటి షరతులు లేకుండా, ఒబీసీ మరియు మైనారిటీ మహిళలకు సబ్‌కోటాలతో సహా 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
గుంటూరులో జరిగిన పి.ఓ.డబ్ల్యు 9వ రాష్ట్ర మహాసభల పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బతకల ఈశ్వరమ్మ మాట్లాడుతూ, మహిళా ఉద్యమాలు మరియు ప్రజాస్వామ్య శక్తుల దీర్ఘకాల పోరాటాల ఫలితంగానే మహిళా రిజర్వేషన్ సాధ్యమైందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును వినియోగించకుండా వెంటనే అమలు చేయాలని కోరారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను సమాన హక్కులు కలిగిన పౌరులుగా కాకుండా పిల్లలను కనే యంత్రాలుగా చూస్తున్నాయని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు, విధానాలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలకు ఉపాధి, ఆదాయం మరియు సామాజిక భద్రత కల్పించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధుల కోతలు, పని దినాల తగ్గింపు, వేతనాల చెల్లింపుల్లో జాప్యాల ద్వారా ఈ పథకాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.
ఉపాధి హామీ పథకం స్థానంలో ప్రతిపాదిస్తున్న వి.బి.జి.ఆర్.వై (VBGRY) పథకం ప్రజల చట్టబద్ధమైన ఉపాధి హక్కును హరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ అమలు, ఉపాధి హామీ పథకం పరిరక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం జూన్ 1 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, సభలు, ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 15న ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని మహిళలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.ఓ.డబ్ల్యు జిల్లా కమిటీ సభ్యురాలు వంకల డిల్లేశ్వరి, మహిళా సంఘం నాయకులు లలిత, వరాలమ్మ, కళావతి పాణిగ్రాహి, హేమావతి, పార్వతి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News