E-PAPER

శ్రీ గిరి లక్ష్మి ఇసుక ట్రైబల్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలి: అలెం కోటి

పినపాక, జూన్ 10 (ప్రతినిధి): పినపాక మండలంలోని దుగినపల్లి–చేగర్శల గ్రామాలకు చెందిన శ్రీ గిరి లక్ష్మి ఇసుక ట్రైబల్ లేబర్ కాంట్రాక్టర్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి డిమాండ్ చేశారు. బుధవారం చేగర్శల గ్రామాన్ని సందర్శించిన ఆయన సొసైటీ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, 2010లో 284 మంది గిరిజన సభ్యులతో సొసైటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతో చేగర్శల ప్రత్యేక పంచాయతీగా మారిన తర్వాత, కొందరు నాయకులు చేగర్శల సభ్యులను సొసైటీ నుంచి వేరు చేసి కొత్త సొసైటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై స్పందించిన అలెం కోటి, గిరిజనుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను తుడుం దెబ్బ సహించబోదని స్పష్టం చేశారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం గిరిజనుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గిరిజన సమాజం బలంగా ఉండాలంటే ఐక్యత అవసరమని, గ్రామాల పేరుతో లేదా రాజకీయాల పేరుతో ఆదివాసీలను విడదీయడం సరికాదని పేర్కొన్నారు. రెండు గ్రామాలకు చెందిన సభ్యులకు సమాన న్యాయం జరిగేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.

సొసైటీకి సంబంధించిన అన్ని అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం తుడుం దెబ్బ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో తుడుం దెబ్బ నాయకులు, సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!