పలాస, జూన్ 7 (వై7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా మహేంద్రగిరి కొండల ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చినట్లు భావిస్తున్న ఓ భారీ కొండచిలువ పలాస మండలంలోని దేశబట్టి కాలువ వద్ద ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
కాలువ సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆ భారీ కొండచిలువను చూసి బెంబేలెత్తిపోయారు. ఇంత పెద్ద కొండచిలువను తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పలాస అటవీశాఖ రేంజర్ మురళీకృష్ణ నాయక్ వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. కొండచిలువకు ఎలాంటి హాని చేయవద్దని స్థానికులకు సూచించారు.అనంతరం స్నేక్ క్యాచర్ ఓంకార్‌ను పిలిపించి అత్యంత జాగ్రత్తగా ఆ భారీ కొండచిలువను పట్టించారు. పరిశీలించగా దాని పొడవు సుమారు 13 అడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పట్టుకున్న అనంతరం కొండచిలువను పలాస మండలం లొద్దభద్ర సమీపంలోని అటవీ ప్రాంత కొండల్లో సురక్షితంగా విడిచిపెట్టారు.
ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఎండల కారణంగా మహేంద్రగిరి కొండల ప్రాంతం నుంచి నీటి కోసం లేదా ఆహారం కోసం దారి తప్పి ఈ ప్రాంతానికి చేరి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను సురక్షితంగా తరలించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.









