మణుగూరు: పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో ప్రైవేట్ చిట్టీలు, అక్రమ వడ్డీ వ్యాపారాల దందా రోజురోజుకూ పెరుగుతోందని రేణుక అక్షర మహిళా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని మండలి ఆరోపించింది.కొంతమంది వడ్డీ వ్యాపారులు చెక్కులు తీసుకుని భారీ వడ్డీలతో రుణాలు ఇచ్చి బాధితులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపింది. ఈ వేధింపులను తట్టుకోలేక పలువురు తమ గ్రామాలను విడిచి వెళ్లిపోవడంతో పాటు కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ వడ్డీ, చిట్టీ వ్యాపారాలు చట్టవిరుద్ధమని, అయినప్పటికీ కొందరు విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారని మండలి మండిపడింది. ఈ వ్యవహారంపై స్థానిక డీఎస్పీ, సీఐలు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
బాధితులకు అండగా నిలుస్తామని, ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ చిట్టీ నిర్వాహకులు లేదా ఫైనాన్స్ వ్యాపారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే తమను సంప్రదించాలని రేణుక అక్షర మహిళా మండలి పిలుపునిచ్చింది. బాధితులను స్థానిక పోలీసుల ద్వారా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపింది.
ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ఎండీ షబానా, కోరి శ్యామల, బొడ్డు సౌజన్య, డేరంగుల సుజాత, రెడ్డీబోయిన రేణుక, బడిశా పార్వతి, హేమలత, డాకూరి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.









