ఖమ్మం జిల్లా చింతకాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 5వ తేదీ తెల్లవారుజామున చింతకాని గ్రామానికి చెందిన మాతంగి నాగరాజు, అతని స్నేహితుడు లింగాల మహేందర్ ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ స్నేహితుడిని పరామర్శించి బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో పందిళ్లపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో బోనకల్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఇసుక టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న వారి బైక్‌ను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో మాతంగి నాగరాజు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, లింగాల మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చింతకాని పోలీసులు టిప్పర్ డ్రైవర్ తోట వెంకటేశ్వర్లు (32), కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా నివాసిని గుర్తించారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోగా, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, ఇసుక అక్రమ రవాణా నేపథ్యంలో జరిగిన ప్రమాదంపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.








