E-PAPER

ఉద్దానం రైతుల నిరసన దీక్ష – కార్గో ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద మహాత్మా పూలే విగ్రహం దగ్గర ఉద్దానం రైతులు కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఈరోజు (05-05-2026) నిరసన దీక్ష చేపట్టారు. కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకుడు తామాడ సన్యాసిరావు కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, ప్రజలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

నిరసన దీక్షను కార్గో ఎయిర్‌పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కొమర వాసు, జోగి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉద్దానం తీర ప్రాంతంలో లక్షలాది చెట్లు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణగా నిలుస్తున్నాయని, కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో జీడి, కొబ్బరి, మునగ చెట్లు నరికి వేస్తే వేలాది కుటుంబాల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని వారు అన్నారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ప్రజల భూములను కార్పొరేట్లకు అప్పగించడం అభివృద్ధి కాదని విమర్శించారు. ఇచ్చాపురం వరకు సాగునీరు అందిస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన జీడి బోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో అణు విద్యుత్ కేంద్రం, పవర్ ప్లాంట్లు, ఇప్పుడు కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో ప్రజల భూములను తీసుకోవడం అన్యాయమని ఆరోపించారు.

జూన్ 6న “చలో ఉద్దానం” కార్యక్రమం నిర్వహించి రాంపురంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ చేపడతామని నాయకులు ప్రకటించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!