E-PAPER

సిపిఎం పై కక్షసాధింపు రాజకీయాలు

– భవిష్యత్తు పట్ల ఆందోళనతోనే సిపిఎం పై తప్పుడు కేసులు
– మడిపల్లి గోపాలరావు, సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి

మధిర:

మధిర నియోజకవర్గంలో సిపిఎం పార్టీ పెరుగుతున్న ప్రజాదరణను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీస్ శాఖను ఉపయోగించి సిపిఎం కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఆరోపించారు.
మధిర పట్టణంలోని బోడెపూడి భవన్‌లో శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి అనుకూల ఫలితాలు రావడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు పొందలేకపోవడం స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ పరిణామాలతో భయపడిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సిపిఎం ఎదుగుదలను అడ్డుకోవాలనే దురుద్దేశంతో పోలీస్ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చారని విమర్శించారు.
తోండల గోపారం గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన సాధారణ ఘర్షణను సాకుగా చూపి, సిపిఎం పార్టీకి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలపై హత్యాయత్నం వంటి తీవ్రమైన నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, పండుగ రోజునే అర్ధరాత్రి రిమాండ్‌కు పంపడం దారుణమన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని 70 సంవత్సరాల వృద్ధుడిని, ఇద్దరు రైతులను, ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఒక నిరుద్యోగిని, అంతేకాకుండా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడనే కారణంతో ఒక విలేకరిని కూడా అక్రమంగా ఈ కేసులో ఇరికించి రిమాండ్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చని తెలిపారు. గ్రామంలో ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు.
బోనకల్ మండలం ఆలపాడు గ్రామంలో అధికార పార్టీ నాయకుల దాడిలో ఇద్దరు వ్యక్తులకు తలపై నాలుగు కుట్లు పడేంత గాయాలు, ఎముకలు విరిగేంత తీవ్ర గాయాలు అయినప్పటికీ, బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలిపారు. అదే గ్రామంలో మరుసటి రోజు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను అతిశయపరుస్తూ, తొమ్మిది మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తీవ్రమైన గాయాలు లేకపోయినా హత్యాయత్నం కేసులు ఎలా నమోదు చేస్తారని, పోలీసులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మార్చడం సరైనదేనా అని నిలదీశారు.
మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భట్టి విక్రమార్క ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన సిపిఎం నాయకుల కేసులను మాత్రం అంగుళం కూడా ముందుకు నడపని భట్టి విక్రమార్క, సాధారణ ఘర్షణలను సాకుగా చూపి సిపిఎం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు బనాయించడం ద్వారా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలనుకోవడం అవగాహన లోపమేనన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, పోలీస్ వ్యవస్థ లొంగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై పెరుగుతున్న నిర్బంధాన్ని తిప్పికొట్టేందుకు సిపిఎం పార్టీ పోరాడుతుందని, ఈ పోరాటానికి నియోజకవర్గంలోని ప్రజాస్వామ్యవాదులందరూ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, మంద సైదులు, డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, పట్టణ కార్యదర్శి పడకండి మురళి, మల్లారం మాజీ సర్పంచ్ మందడపు ఉపేందర్ రావు, తేలపోలు రాధాకృష్ణ, పెంటి వెంకట్రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!