E-PAPER

ST హోదాపై కోయా తెగ పోరాటం సుప్రీంకోర్టు తలుపులు తట్టిన ఎం ఎల్ ఏ తెల్లం వెంకటరావు

తేదీ: 24 జూలై 2025

రిపోర్ట్: పులిపాటి పాపారావు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని లంబాడి, సుగాలి మరియు బంజారా వర్గాలకు ఇవ్వబడిన షెడ్యూల్డ్ తెగ (ST) హోదాపై సవాలు చేస్తూ, కోయా తెగకు చెందిన తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ వాదన ప్రకారం, ఈ వర్గాలను ST జాబితాలో చేర్చడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పుపై సవాల్

2024 డిసెంబర్ 17న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో లంబాడి, సుగాలి మరియు బంజారా వర్గాలకు ST హోదా కొనసాగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, దీనిని సవాల్ చేస్తూ తెల్లం వెంకటరావు పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను న్యాయవాది రమేష్ అల్లంకి ద్వారా సుప్రీంకోర్టులో సమర్పించారు.

రాజ్యాంగ ఉల్లంఘన అంటూ అభ్యంతరం

2016లో ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మెట్ల పాపయ్య, 2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌గా సుప్రీంకోర్టులో SLP(C) నం. 17519/2018 (గోండ్వానా వెల్ఫేర్ సొసైటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ) కేసును ముందుగానే ఫైల్ చేశారు. ఇప్పుడు కొత్తగా తెల్లం వెంకట్రావు భద్రాచలం శాసనసభ్యులు మరో పిటిషన్‌తో ముందుకు వచ్చారు.
పిటిషనర్ వాదన ప్రకారం, 1976, 2002 సంవత్సరాల్లో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల (సవరణ) చట్టాలు ద్వారా వీరిని ST జాబితాలో చేర్చడం రాజ్యాంగ ప్రక్రియకు విరుద్ధమని పేర్కొన్నారు.

కోయా తెగల నష్టంపై ఆవేదన

ఈ చేర్పు కారణంగా నిజమైన స్వదేశీ గిరిజనులైన కోయా తెగ సభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విద్య, ఉపాధి మరియు రాజకీయ రిజర్వేషన్లలో లంబాడి, సుగాలి వర్గాల అభివృద్ధి చెందిన అభ్యర్థులు అధికంగా లబ్దిపొందుతుండగా, కోయ తెగలు అణచివేయబడుతున్నాయని పిటిషనర్ వాదించారు.

“విద్యా, ఆర్థికంగా ముందున్న లంబాడి, సుగాలి వర్గాలు అవకాశాలను ఆక్రమించాయి. కోయా తెగలు విద్యా, ఉద్యోగ, ఎన్నికల రిజర్వేషన్లలో పోటీలో వెనుకబడిపోయాయి,” – పిటిషన్ వివరాలు తెలిపాయి.

కేసు స్థితి

ప్రస్తుతం ఈ అంశం తెల్లం వెంకటరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు శీర్షికతో భారత సుప్రీంకోర్టు ముందు విచారణ కోసం వేచి ఉంది. బెంచ్ ఈ కేసును విచారణకు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సామాజికంగా ప్రభావితం కానున్న అంశం

ఈ కేసు తీర్పు తెలంగాణలో గిరిజన రాజకీయ సమీకరణలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవైపు అసలైన గిరిజన హక్కులను పరిరక్షించాలన్న కోయ తెగల వాదన, మరోవైపు వందలాదిగా ఉన్న లంబాడి, సుగాలి వర్గాల ప్రాతినిధ్యం, ఈ కేసు తీర్పు చాలా సామాజిక పరిణామాలకు దారితీయనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్