మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సాయి నగర్ లో ఉన్న శ్రీ సాయి బాబా ఆలయం భక్తుల సందడితో ముస్తాబవుతోంది. శ్రీ శిర్డీ సాయి బాబా వారి ఆరాధనలో భాగంగా 32వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి 23, 2026 సోమవారం జరగనున్న ఈ ఉత్సవాలకు ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఉదయం కాకడ ఆరతితో కార్యక్రమాలు ప్రారంభమై, అభిషేకాలు, పుష్పాలంకరణ, హారతి, సాయంత్రం ధూప దీపారాధన, భక్తి సేవలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సాయి బాబా ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.








