టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. సినిమాలో యాక్షన్, ఎమోషన్స్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారని, ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన ఫైట్ సీన్స్ అదరగొట్టాయని చిరు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ అరుదైన అభినందనలకు సమంత పూర్తిగా ఫిదా అయిపోయారు. ఇంతటి లెజెండరీ వ్యక్తి నుంచి ప్రశంసలు అందుకోవడం ఒక కల లాగా ఉందంటూ ఆమె ఎమోషనల్ అవుతూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అయితే, సినిమాను ప్రశంసిస్తూ చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌లో ఆయన తనదైన శైలిలో ఇచ్చిన ఒక లీక్ ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. ట్వీట్ చివర్లో.. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత, రాజ్ దంపతులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ చిరు ఒక సర్‌ప్రైజింగ్ లైన్‌ను యాడ్ చేశారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మాటతో సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిందని, త్వరలోనే ఆమె తల్లి కాబోతోందన్న గుడ్ న్యూస్‌ను మెగాస్టార్ ఇలా లీక్ చేసేశారని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ మొదలైంది.
గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్‌లో సమంత బేబీ బంప్ గురించి నెట్టింట ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ చిరంజీవి గారే స్వయంగా శుభాకాంక్షలు చెప్పడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయింది, దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం, మరోవైపు పర్సనల్ లైఫ్‌లో మాతృత్వాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవ్వడం పట్ల అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా, తన సినిమాల విషయాలే కాకుండా ఇలా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో కూడా ‘చిరు లీక్స్’ భలే ట్రెండ్ సృష్టిస్తున్నాయని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేసుకుంటున్నారు.








