తమిళనాడు అసెంబ్లీ వేదికగా రాజకీయ రగడ తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌పై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన రీతిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘తండ్రి కోసం వెతుకుతున్న కొడుకు’ అంటూ పరోక్షంగా స్టాలిన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఒక పిట్టకథ చెప్పారు. దీనికి ఏమాత్రం తగ్గని ఉదయనిధి స్టాలిన్.. నేరుగా విజయ్ వ్యక్తిగత, వైవాహిక జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని గట్టి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
విజయ్ చెప్పిన కథకు ధీటుగా బదులిచ్చిన ఉదయనిధి.. “చెంగల్పట్టు కోర్టులో తన భర్త కోసం వెతుకుతున్న భార్య కథ తమిళనాడు ప్రజలందరికీ బాగా తెలుసు” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరోక్షంగా విజయ్ విడాకుల వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా రాజకీయ విమర్శలను పర్సనల్ లెవల్‌కు తీసుకెళ్లారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రైతుల సమస్యలు, విద్యుత్ కోతలు, క్షీణిస్తున్న శాంతిభద్రతల గురించి మాట్లాడకుండా.. ఇలా సినిమాల్లో లాగా పంచ్ డైలాగులు, కథలు చెప్పడం సభా మర్యాదకు విరుద్ధమని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
అసెంబ్లీలోని లైవ్ కెమెరాలను చూసి సినిమా షూటింగ్ కెమెరాలుగా విజయ్ భ్రమపడుతున్నారని ఉదయనిధి ఎద్దేవా చేశారు. ఇకపై ‘నటుడు విజయ్’ అనే ముద్ర నుంచి బయటకు వచ్చి, బాధ్యతాయుతమైన ‘ముఖ్యమంత్రి విజయ్’ లాగా ప్రవర్తించాలని ఆయన హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీస్తుంటే, వాటికి సరైన సమాధానాలు చెప్పలేకనే సీఎం ఇలాంటి కల్పిత కథలతో కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. మొత్తానికి డీఎంకే, టీవీకే అధినేతల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.








