టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి
మణుగూరు జూలై 01 వై 7 న్యూస్;
జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం ఓబీ కార్మికుల దగ్గర టి యు సి ఐ రాష్ట్ర కమిటీ ముద్రించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, తదితర డిమాండ్ల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాల తో పాటు, రాష్ట్ర కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, ఫెడరేషన్లు జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి, కార్మికుల శ్రమను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకున్నది అన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని, ముందు తరాల కార్మిక వర్గం పోరాడి రక్త తర్పణ చేసి హక్కులు, చట్టాలు సాధిస్తే, నేడు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మిక హక్కులను కాలరాయడానికి పూనుకున్నది అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకుల తదితర ధరలను పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారాలు మోపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.