రావెళ్లి రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్ జూన్ 13 వై7 న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి చట్టం లో భాగంగా రెవెన్యూ సదస్సులకు రైతుల నుండి మంచి స్పందన వస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం రోజున కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. అనంతరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలంలో గల రంగాయపల్లి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను జిల్లా కలక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. సదస్సులలో భాగంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం అని, ప్రతి భూ సమస్యకు భూ భారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం ఉంటుందని తెలిపారు. రైతుల నుండి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించి, రైతులకు అర్థం అయ్యే విధంగా భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించారు. అన్ని భూ సమస్యలకు పరిష్కారం ఉంటుందని, అసైన్డ్ భూములు, సాదబైనామా, పిఓటి ఇతర భూ సమస్యలను పరిష్కస్తామన్నారు. సాదాబైనామాల గురించి వివరిస్తూ ఇకపై ప్రభుత్వo సాదాబైనామాల క్రమబద్దీకరణ చేయుట వీలుపడదని, ఒకవేళ చేసిన ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకే స్టాంప్ డ్యూటీ రుసుమును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని దీనికి బదులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మేలు అని తెలిపారు. ఇప్పటివరకు సాదాబైనామా ద్వారా జూన్ 2, 2014 లోపు కొనుగోలు చేసి గత 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12, అక్టోబర్ 2020 నుండి 10 నవంబర్ 2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం సన్న , చిన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవో విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రుసుమును వసూలు చేసి సర్టిఫికెట్ జారి చేస్తారు. హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. అలాగే సదస్సులు నిర్వహిస్తున్న అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది యొక్క నిర్వహణ తీరును పరిశీలించారు. భూ భారతి చట్టం తీసుకొచ్చింది రైతుల కోసమే అని వారి యొక్క సమస్యను విని వారికి అర్థం అయ్యేలా వివరించాలని , ఎటువంటి తప్పులు చేయకుండా పకడ్బందీగా సదస్సులు నిర్వహించాలని, రైతుల సమస్యలను పూర్తి వివరాలతో రికార్డులో నమోదు చేయాలని,ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధులలో తప్పని సరిగా ఉండాలని అవసరమైతే 6 గంటల వరకు ఉండి రైతుల దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమం లో తూప్రాన్ ఆర్. డి. ఓ జయచంద్రా రెడ్డి, మనోహారాబాద్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తూప్రాన్ తహసీల్దార్ శ్రీనివాస్, వెల్దుర్తి తహశీల్దార్ కృష్ణ, ఆర్ఐ ప్రేమ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది,సదస్సులు నిర్వహిస్తున్న ఇంచార్జీలు పాల్గొన్నారు.









