E-PAPER

క్రిటికల్ మినరల్స్ మైనింగ్ రంగంలో సింగరేణికి పూర్తి సహకారం

సింగరేణి భవన్,జనవరి 25 వై 7 న్యూస్;

ఐఐటీ హైదరాబాద్ మేథో విజ్ఞానాన్ని, సాంకేతికతను అందించేందుకు సంసిద్ధం
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్.మూర్తి
సింగరేణి భవన్, జనవరి 25, 2025
బొగ్గు మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో ఇటీవల ఐఐటీ హైదరాబాద్ తో కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్.మూర్తి నేతృత్వంలో ప్రొఫెసర్ల బృందం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ నేతృత్వంలో డైరెక్టర్లు, సీనియర్ మైనింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది.క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సింగరేణి చేస్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ ఐఐటీ పూర్తి సహకారం అందిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీ బి.ఎస్.మూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్లో బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా క్రిటికల్ మినరల్స్ మైనింగ్, ప్రాసెసింగ్లోనూ సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దేందుకు మేథో విజ్ఞానాన్ని, సాంకేతిక సహకారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశం లో క్రిటికల్ మినరల్స్ మైనింగ్ రంగంలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగింది.
రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, మరియు ఎలక్ట్రానిక్స్ తయారీలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని శ్రీ బిఎస్.మూర్తి తెలిపారు. హరిత ఇంధనాన్ని ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో క్రిటికల్ మినరల్స్ మైనింగ్ది కీలక పాత్ర అన్నారు.ఐఐటీ హైదరాబాద్లో నిపుణులు ఈ రంగంలో ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నారని, ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీలైన మోనాష్, సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీలతో ప్రత్యేక ఒప్పందం ఉందని చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా సింగరేణి ఉద్యోగులకు ఐఐటీ ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు అందించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, మైనింగ్ రంగంలో డ్రోన్లు, కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి ఆధునిక టెక్నాలజీలనుఅనుసంధానం చేయడానికి తోడ్పాటును అందిస్తామన్నారు. అలాగే ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని, అంకుర పరిశ్రమల యూనిట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణితో మేథో విజ్ఞానాన్ని పంచుకోవడానికి ఐఐటీ హైదరాబాద్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. త్వరలోనే క్రిటికల్ మినరల్స్ పై సింగరేణి అధికారులకు అవగాహన కల్పించేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక వర్కుషాప్ను నిర్వహిస్తామన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న ఫ్లైయాష్ లోనూ అరుదైన ఖనిజాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలిందని, వీటిని వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపైనా పరిశీలించాలని ఐఐటీ హైదరాబాద్ బృందాన్ని కోరారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు , జి.వెంకటేశ్వరరెడ్డి, సింగరేణి భవన్ నుంచి జీఎం (కో ఆర్డినేషన్) ఎస్.డి.ఎం.సుభానీ, క్రిటికల్ మినరల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, నిపుణులు సందీప్ హామిల్టన్, ఐఐటీ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ నరసింహ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అశోక్ కామరాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్