– బాధిత మహిళలకు ‘భరోసా’ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ‘భరోసా’ కేంద్రాల సేవల బలోపేతంపై అడిషనల్ డీసీపీ రామానుజం కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హింస, లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సమగ్ర సహాయం అందించడంలో ‘భరోసా’ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. పోలీస్, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్ సేవలను ఒకే వేదికపై అందించడం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం, రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పోలీస్ స్టేషన్, కోర్టుల వాతావరణానికి దూరంగా సురక్షితమైన, గోప్యమైన వాతావరణంలో సేవలు అందించడం ద్వారా బాధితుల్లో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపుతున్నట్లు ఆయన వివరించారు. అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ ద్వారా మానసిక స్థైర్యం కల్పిస్తున్నారని చెప్పారు.
అదేవిధంగా ఎఫ్‌ఐఆర్ నమోదు నుండి కోర్టు విచారణ వరకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు, స్వల్పకాలిక ఆశ్రయం, విద్యా సౌకర్యాలు, స్వయం ఉపాధి శిక్షణ ద్వారా బాధితులు ఆర్థికంగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ICPS అధికారులు, చైల్డ్ లైన్ ప్రతినిధులు, CWC & JJ బోర్డు సభ్యులు, DLSA ప్రతినిధులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, SERP ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కౌన్సెలర్లు, దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.








