పలాస, జూన్ 12 (వై7 న్యూస్):
పలాస మండలంలోని హిమగిరి గ్రామంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మహిళా సాధికారత (నారీ శక్తి), కొత్త చట్టాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో పండుగలు, ఉత్సవాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లు, పేకాట, గంజాయి, నాటుసారా అక్రమ రవాణా మరియు విక్రయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో 112 సేవల వినియోగం తదితర అంశాలపై కూడా గ్రామస్తులకు వివరించారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు.








