ఖమ్మం:
నగరంలోని ప్రముఖ మొబైల్ విక్రయ కేంద్రం సోని విజన్ షోరూమ్‌లో అర్ధరాత్రి జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు షాపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, స్టాక్ రూమ్‌లో భద్రపరిచిన ఖరీదైన అధునాతన మొబైల్ ఫోన్లను అపహరించినట్లు సమాచారం.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇక క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరిస్తోంది. షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్ల విలువ ఎంత అనే విషయంపై యాజమాన్యం వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.









