ఆధునిక జీవనశైలిలో భాగంగా చాలామంది ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల తరబడి కదలకుండా కూర్చుని పనిచేస్తున్నారు. ఇలా నిరంతరాయంగా కూర్చోవడం వల్ల కేవలం వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలే కాకుండా శరీరంలోని ఇతర ముఖ్యమైన అవయవాలూ తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కదలకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ వంటి అవయవాల పనితీరు దెబ్బతింటుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అలాగే, కండరాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది టైప్-2 మధుమేహానికి (డయాబెటిస్) దారితీస్తుంది. వీటితో పాటు జీర్ణక్రియ మందగించడం, కాలేయ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
ఈ ప్రమాదాల నుండి బయటపడటానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ఆఫీస్ పనిలో ఉన్నప్పటికీ ప్రతి 30 నుండి 45 నిమిషాలకు ఒకసారి సీటు నుండి లేచి 2 నిమిషాల పాటు అటుఇటు నడవడం (వాకింగ్) అలవాటు చేసుకోవాలి. పని చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండేలా చూసుకోవడం, కూర్చునే పద్ధతిని (Posture) మార్చుకోవడం, రోజూ తగినంత నీరు తాగడం ముఖ్యం. ఫోన్ మాట్లాడేటప్పుడు నిలబడి మాట్లాడటం, లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.








