మణుగూరు, జూన్ 9 (వై7 న్యూస్): మణుగూరు బస్ డిపో సమీపం నుంచి కూనవరం వరకు చేపట్టిన రహదారి విస్తరణ (రోడ్డు వైడెనింగ్) మరియు ఆధునిక సెంట్రల్ లైటింగ్ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, సమితి సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు మాట్లాడుతూ, సమితి సింగారం ప్రజల దశాబ్దాల కలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సాకారం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ అభివృద్ధిని కార్యరూపంలో చూపిస్తున్నారని పేర్కొన్నారు.
రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయితే మణుగూరు మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే వ్యాపార, రవాణా రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
పనుల పురోగతిని పరిశీలించిన నాయకులు నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరే విధంగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని కోరారు.
స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రధాన సమస్యకు పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే నాయకుడు తమకు లభించడం అదృష్టమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు మాదాడి రాజేష్, రహీం పాషా, కోలపిన్ని మానస, కృష్ణవేణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గణేష్ రెడ్డి, జీవీ, యాకూబ్ అలీ, కొమరం రామ్మూర్తి, సాంబశివరావు, కుమార్, చలపతిరావు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.








