భద్రాచలం, మే 21 (వై7 న్యూస్): భద్రాచలం పట్టణ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం DSP ఆదేశాల మేరకు పట్టణ ఎస్సై పి. శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కొల్లుగూడెం వెళ్లే ర్యాంప్ వద్ద మంగళవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూనవరం రోడ్ వైపు నుంచి భద్రాచలం వైపుకు వస్తున్న ఓ మోటార్ సైకిల్‌ను ఆపి తనిఖీ చేయగా, భద్రాచలంకు చెందిన మురళీకృష్ణ, దుమ్ముగూడెం మండలానికి చెందిన గుండి వంశీకృష్ణ, తెల్లం ముఖేష్‌లు ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల విచారణలో ఒడిశాకు చెందిన విక్రం, శంకర్ అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి భద్రాచలంకు తీసుకొస్తున్నట్లు వెల్లడైంది. వారి వద్ద నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 12.928 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.6,46,400గా పోలీసులు అంచనా వేశారు.
అలాగే ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భద్రాచలం టౌన్ ఎస్సై వి. సతీష్ కేసు నమోదు చేయగా, దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ మరియు భద్రాచలం ఇన్చార్జ్ వెంకటప్పయ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా భద్రాచలం DSP మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, మత్తు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.








