మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ సారంగపాణి..
మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామం నక్షత్ర ఓపెన్ వెంచర్ ప్రాంతంలో మే 15 న జరిగిన మహిళ హత్య కేసును మధిర రూరల్ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు.
కేసు వివరాల ప్రకారం… మే 16 న గోపిశెట్టి సాయిరామ్ @ సాయి అనే వ్యక్తి తన అక్క గోపిశెట్టి కల్పన (28), నివాసం మేడూరు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా, కనిపించడం లేదని… కల్పన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు లాగే మే 15 న ఉదయం మేడూరు నుండి మధిరకు విధులకు వెళ్తున్నానని ఇంటి నుండి బయలుదేరిన ఆమె ఆ రోజు కార్యాలయానికి హాజరు కాలేదని సహోద్యోగి ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందిందని, అదే రోజు యార్లగడ్డ చెన్నారావు అనే వ్యక్తి ‘మీ అక్క నా దగ్గర ఉంది, మాట్లాడుకోవాలి’ అంటూ ఫోన్ సందేశం పంపినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. అనంతరం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టగా, కృష్ణాపురం గ్రామ శివారులోని నక్షత్ర ఓపెన్ వెంచర్ ప్రాంతంలో కల్పన మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఆమె మెడ, నోటి చుట్టూ చున్నీ బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. మధిర రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించగా, నిందితుడు యార్లగడ్డ అంకుశరావు @ చెన్నారావు (30), కనుమూరు గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా వాసి, మృతురాలితో సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు వెల్లడైందన్నారు. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు.
కేసు నమోదు అనంతరం నిందితుడు కోసం (3) ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడుని అదుపులోకి తీసుకోడం జరిగిందని తెలిపారు.
15.05.2026 న నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కృష్ణాపురం సమీపంలోని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో, తమ సంబంధం గురించి తన భార్యకు చెబుతానని మృతురాలు హెచ్చరించడంతో, కోపోద్రిక్తుడైన నిందితుడు చున్నీతో ఆమె మెడ బిగించి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
20.05.2026 తేదీన అంబరుపేట వెంచర్ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి, అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు.








