అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని భద్రాద్రి జిల్లా కమిటీ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం : ప్రభుత్వ కొత్త జీవో 252 నిబంధనలు పాత్రికేయులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది.
సమావేశంలో డీపీఆర్వో పెద్ద పత్రికల విషయంలో నిబంధనల ప్రకారం తొలుత కమిటీ సభ్యులతో పాటు జిల్లాకు నాలుగు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే దీనిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. జిల్లాలోని మండల స్థాయి రిపోర్టర్లకు కూడా కార్డులు అందించిన తర్వాతే తాము కార్డులు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రస్తుతం పెద్ద పత్రికలకు నాలుగు కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఎంపానెల్‌లో ఉన్న ప్రతి పత్రికకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, కేబుల్ ఛానళ్ల జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ రిపోర్టర్‌కూ అన్యాయం జరగకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సంబంధిత డిమాండ్లను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు.
పెద్ద పత్రికలకు జిల్లా కేంద్రం, కార్పొరేషన్, భద్రాచలం టెంపుల్ ఏరియా, నియోజకవర్గ స్థాయిల్లో కలిపి ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లాలో తొమ్మిది కార్డులు, కేబుల్ ఛానళ్లకు కూడా జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మాన ప్రతిని కలెక్టర్‌కు అందజేశారు.
తీర్మానాన్ని స్వీకరించిన కలెక్టర్, ఐఎన్పీఆర్ కమిషనర్‌తో మాట్లాడి జిల్లాలోని జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో డీపీఆర్వో అజ్గర్ హుస్సేన్, కమిటీ సభ్యులు బి.వి. రమణారెడ్డి, కల్లోజు శ్రీనివాస్, వట్టికొండ రవి, ఎం.ఏ. వాహెద్, జి. వెంకటేశ్వర్లు, మొబగాపు ఆనంద్, మాటేటి మధు, ఎండీ యాకుబ్ పాషా, నాగ చంద్ర, ప్రశాంత్, ఆర్టీసీ అధికారి వైఎన్ రావు, పిల్లి రాజేష్, ఫణికుమార్, మోక్షిత్ తదితరులు పాల్గొన్నారు.








