మణుగూరు: తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మణుగూరు, ఏడూళ్ల బయ్యారం ప్రాంతాలకు చెందిన రాధిక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. అత్యున్నత మార్కులు సాధించి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన క్యాంపు కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా లింగాల కల్పితరెడ్డి 586/600 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, జి. నక్షత్ర కృతి 577, బి. ధనలక్ష్మి 576, పి. మురళీకృష్ణ 572, సాయి సుజిత్ 572, శామ్యూల్ 564, మహమ్మద్ పాషా 564, అశ్వత్ సాయి 564, డి. హరిణి 560 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. అదేవిధంగా 500 పైగా మార్కులు సాధించిన 45 మంది విద్యార్థులను కూడా ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల కష్టపడి చదవడం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కలిసి ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
పాఠశాల చైర్మన్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేక అధ్యయన ప్రణాళికలు, అదనపు తరగతులు, క్రమశిక్షణతో కూడిన బోధనా విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు విలువల పెంపుకు కూడా పాఠశాల ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఫలితాలు వెలువడిన వెంటనే పాఠశాలలో ఆనందోత్సవాలు వెల్లువిరిశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకోగా, తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, పాఠశాల డైరెక్టర్లు జయసింహా రెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్, ఇంచార్జీలు ఉష, కీర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.









