పలాస:
మధ్యాహ్న భోజన పథకంలో స్మార్ట్ కిచెన్ల ప్రతిపాదనను రద్దు చేసి, కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలాస మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ—స్మార్ట్ కిచెన్ల అమలుతో తమ ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు.అలాగే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, వంట నిర్వహణ కోసం ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం, ఐడీ కార్డులు, యూనిఫాం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ సత్యం గారికి సమర్పించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి, యూనియన్ అధ్యక్షురాలు పి. భూదేవి మాట్లాడుతూ—కాంట్రాక్టర్ల లాభాల కోసం కార్మికుల ఉపాధిని దెబ్బతీయడం అన్యాయమని విమర్శించారు. పథకం ప్రారంభ దశలో వేతనాలు లేకపోయినా అప్పులు చేసి సేవలు అందించిన కార్మికులను ఇప్పుడు ఉపాధి లేకుండా చేయడం సరైంది కాదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానాన్ని విరమించి మధ్యాహ్న భోజన పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు వై. మణమ్మ, బి. శశిరేఖ, కె. మహాలక్ష్మి, కె. తులసి, జి. పుణ్యావతి, వై. తులసి, కె. పెద్దింటమ్మ తదితరులు పాల్గొన్నారు.








