వెంకటాపురం (ములుగు), ఏప్రిల్ 7:
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి .శివధర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన, పామునూరు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల ప్రగతికి బాటలు వేశారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ… కర్రేగుట్టలపై మావోయిస్టుల ప్రభావం శూన్యమని, ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా గుత్తికోయ ప్రజలకు అండగా ఉంటూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తాయని భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే పామునూరుకు చెందిన ఏడు కుటుంబాల ఉమ్మడి ఉపాధి కోసం ఒక ఆటోను, ఒక ద్విచక్ర వాహనాన్ని అందజేయడంతో పాటు వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అటవీ సంపద, ప్రకృతి అందాలతో అలరారుతున్న కర్రేగుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే లక్ష్యంతో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాలనలో పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి కోసం అటవీ, రెవెన్యూ, సీఆర్పీఎఫ్ మరియు పోలీస్ శాఖల మధ్య మెరుగైన సమన్వయాన్ని పెంచేందుకు ఒక ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
అనంతరం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా “అరైవ్ అలైవ్” అనే అవగాహన కార్యక్రమానికి డిజిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 3000 మంది పాల్గొన్న ఈ సభలో డిజిపి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రాణాల కంటే ఏదీ మిన్న కాదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 200 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేయడంతో పాటు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి, వాహనదారుల ఆరోగ్య భద్రతపై ఆరా తీశారు.డిజిపి బి.శివధర్ రెడ్డి పామునూరులోని సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్‌ఓబీ)ని సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న జవాన్లతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో జవాన్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా కర్రెగుట్టలు వంటి కొండ ప్రాంతాల్లో వ్యూహాత్మక పట్టు సాధించడానికి, మావోయిస్టు రహిత ప్రాంతంగా కొనసాగించడానికి రాష్ట్ర పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య నిరంతర సమన్వయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక భద్రతను పటిష్టం చేయడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.
మొరమురులో మహిళా నర్సరీ ప్రారంభం
అటవీ పెంపకంలో మహిళల భాగస్వామ్యం భేష్
అనంతరం మొరమురు గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నర్సరీని డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర పిసిసిఎఫ్ సువర్ణతో కలిసి ప్రారంభించారు. అటవీ విస్తరణలో మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. నర్సరీ కార్యకలాపాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ సమన్వయంలో జరిగిన ఈ పర్యటనలో పీసీసీఎఫ్ సువర్ణ, గ్రేహౌండ్స్ అడిషనల్ డిజిపి అనిల్ కుమార్, ఎస్ఐబి ఐ జి పి సుమతి, సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తదితరులు పాల్గొన్నారు.








