కొత్తగూడెం :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.
శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలాల వారీగా ఇప్పటికే అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్ఓలు), బూత్ లెవెల్ అధికారులతో సమావేశాలు నిర్వహించినందున, ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని తెలిపారు. ఇంకా సమావేశాలు జరగని ప్రాంతాల్లో వెంటనే నిర్వహించాలని ఆదేశించారు.
బూత్ లెవెల్ అధికారులు సంబంధిత యాప్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, ఓటరు వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ స్పందన :
ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి ఇప్పటికే 61.25 శాతానికి చేరుకుందని తెలిపారు. మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
ప్రతి మండలంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం పెంచి బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితత్వంతో కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.








