E-PAPER

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి – కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం :
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న ఆరోగ్యశ్రీ సేవలపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల పరిధిలో కొనసాగుతున్న నూతన నిర్మాణాలు, మరమ్మత్తుల పనుల పురోగతిని సమీక్షించి, పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి ఆసుపత్రి వారీగా సూపరింటెండెంట్ల నుండి సమాచారం సేకరించి, ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, సిబ్బంది కొరత, వైద్యుల లభ్యతపై సమీక్షించారు. అవసరమైన సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తుల అవసరాన్ని సూపరింటెండెంట్ తెలియజేయగా, వెంటనే చర్యలు తీసుకుని పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులపైనే విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాల వివరాలను సమీక్షించి, అవసరమైన చోట సేవలను మరింత మెరుగుపరచాలని తెలిపారు.
ప్రతి ఆసుపత్రిలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తగిన శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వల వివరాలను పరిశీలించి అత్యవసర సేవలకు ఎటువంటి లోటు లేకుండా చూడాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేయాలని, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో నమోదు అవుతున్న సికిల్ సెల్ అనీమియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసుల అధికత ఉన్న మండలాలు, పరీక్షల నిర్వహణ విధానం, కిట్ల లభ్యతపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీసీహెచ్‌ఓ రవిబాబు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News