E-PAPER

భూభారతి దరఖాస్తులపై కలెక్టర్ కఠిన ఆదేశాలు… అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

కొత్తగూడెం;
జిల్లాలో భూసంబంధిత సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి భూ సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. శాఖల మధ్య సమన్వయం పెంచి ప్రతి సమస్యను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను బీఎల్ఓల వారీగా, మండలాల వారీగా విభజించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి బీఎల్ఓకు లక్ష్యాలు నిర్దేశించి సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగణన ఏర్పాట్లు పూర్తి చేసి, తహసీల్దారుల ఐడీ క్రియేషన్‌ను వేగవంతం చేయాలని, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.
అక్రమ ఇసుక రవాణాపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, ఇసుక రీచ్‌ల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే ఇసుక రీచ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని పేర్కొంటూ, ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను సమర్పించాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పురోగతి, పెండింగ్ కోర్టు కేసులపై సమగ్ర సమాచారం అందించాలని కోరారు. వచ్చే వారంలో జిల్లాలోని తహసీల్దారులతో భూభారతి, ప్రజావాణి, ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, జనగణన, భూసేకరణ అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ స్వర్ణలత, ఏడి మైన్స్ దినేష్, భూసేకరణ అధికారి యాసిన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News