E-PAPER

సారపాక గ్రామసభలో హామీల అమలుపై గళమెత్తిన సిపిఎం నేతలు

బూర్గంపాడు ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలో గురువారం “ప్రభుత్వ పాలన 99 రోజులు” కార్యక్రమం సందర్భంగా గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభకు సర్పంచ్ కిషోర్ నాయక్ అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ 27 నెలల పాలనలో అభివృద్ధి ఘనంగా జరిగిందని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు.
అయితే, గ్రామసభలో సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వ హామీల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో చాలా వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉన్నప్పటికీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం పూర్తిగా అందరికి అందలేదని పేర్కొన్నారు. మహిళలకు ప్రతినెల రూ.2500 ఇస్తామని ఇచ్చిన హామీ అమల్లోకి రాలేదని తెలిపారు.
భూమిలేని పేద కుటుంబాలకు, ఉపాధి కార్మికులకు రూ.12,000 ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. గ్యాస్ సబ్సిడీ రూ.500, ప్రతి ఇంట్లో పెళ్లికి ఒక తులం బంగారం వంటి హామీలు కూడా ఎక్కడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటో కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి రూ.12,000 సహాయం ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా కార్మికులకు రూ.18,000, అంగన్వాడీ కార్మికులకు రూ.26,000 వేతనం ఇస్తామని చెప్పినా అమలు కాలేదని ఆరోపించారు.
వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడంతో వారు నిరాశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.
సారపాక పంచాయతీలో 130 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, బేస్ మట్టం వేసుకున్న వారికి కూడా ఇళ్ల నిర్మాణం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతుబంధు అందరికీ అందలేదని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని చెప్పారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పనులను తగ్గించిందని, వేల మంది కార్మికులు ఉన్నా కేవలం 648 జాబ్ కార్డులకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని గ్రామసభలో తీర్మానం చేసి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, ఎస్.కె అబిదా తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!