కొత్తగూడెం:
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో వివిధ టెండర్ల విషయంలో నెలకొంటున్న గందరగోళానికి బాధ్యత ఎవరిదని ఆవాజ్ పట్టణ కార్యదర్శి, “సేవ్ కొత్తగూడెం – సేవ్ కార్పొరేషన్” కన్వీనర్ జలాల్ ప్రశ్నించారు.
కార్పొరేషన్ హోదా వచ్చినప్పటికీ 60 డివిజన్లకు సంబంధించిన పనులను ఒకే టెండర్ విధానంలో నిర్వహిస్తే కార్పొరేషన్‌కు లాభం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను వేర్వేరు సెక్టార్లుగా విభజించి టెండర్లు పిలవడం భవిష్యత్తులో నష్టాలకు దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు ప్రస్తుతం సంత, డైలీ మార్కెట్, కబేళా టెండర్లలో కూడా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించకపోవడం, నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం ఆశ్చర్యకరమని ఆయన విమర్శించారు.
కొంతమందికి టెండర్లు కేటాయించి, అనంతరం ఘర్షణల నేపథ్యంలో వాటిని రద్దు చేయడం సరికాదని, “అధికారం మాకు ఉంది” అంటూ అధికారులు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. టెండర్లు ఎవరికైనా కేటాయించినా తమకు అభ్యంతరం లేదని, అయితే నిబంధనలు పాటిస్తూ కార్పొరేషన్‌కు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
జరుగుతున్న టెండర్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా టెండర్లు కేటాయించాలని జలాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో టెండర్ల విషయంలో లేదా అభివృద్ధి పనుల్లో ఎలాంటి నష్టం జరిగినా తీవ్ర స్థాయిలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.









