భద్రాచలం;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన అర్చకులకు రాష్ట్ర స్థాయి గౌరవం లభించింది. ఋగ్వేద పండితులు శ్రీ కెవికెఎస్ కామేశ్వరరావు , ఉప ప్రధానార్చకులు శ్రీ అమరవాది మురళీకృష్ణమాచార్యులు కి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు.
వేద పరిరక్షణ, ఆలయ ఆగమ శాస్త్రాచరణ, భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించడంలో వారు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భద్రాచలం రామాలయం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రమని, అక్కడి అర్చకుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. వేద సంస్కృతి పరిరక్షణలో వారి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
పురస్కారం అందుకున్న అనంతరం అర్చకులు స్పందిస్తూ, ఈ గౌరవం తమ బాధ్యతను మరింత పెంచిందని, భక్తులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఉగాది పర్వదినం సందర్భంగా భద్రాచలం అర్చకులకు రాష్ట్ర గౌరవం లభించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.









