మెదక్ జిల్లా:
తనువు చాలించినా మరొకరి శరీరంలో శ్వాసగా మారడం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మెదక్ జిల్లా శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామానికి చెందిన కుంటా సందీప్ కుమార్ (28) కుటుంబం.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్ కుమార్ వైద్యుల ప్రకారం బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఈ విషాద సమయంలో కుటుంబం పుట్టెడు శోకంలో మునిగిపోయినా, సోదరుడు సాయి కుమార్ తీసుకున్న నిర్ణయం మహోన్నతంగా నిలిచింది.
సందీప్ కాలేయం, ఊపిరితిత్తులను దానం చేయడంతో ఇద్దరు రోగులకు పునర్జన్మ లభించింది. మరణానంతరం కూడా జీవాన్ని పంచే ఈ నిర్ణయం అందరినీ కదిలిస్తోంది.
ఈ ఘటనపై సిపి సజ్జన్నార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ,
“తనువు చాలించినా మరొకరి శరీరంలో శ్వాసగా మారడం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. క్లిష్ట సమయంలో ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఆ కుటుంబానికి అభినందనలు. అవయవదానం ఒక మహాదానం” అని పేర్కొన్నారు.
అలాగే ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకొని, ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు.









