E-PAPER

ప్రభుత్వ భూములపై కబ్జా కోరలు – ఎర్ర చెరువును మింగేస్తున్న భూకబ్జాదారులు

Y7 న్యూస్ పలాస;

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు, కాలువలు, చెరువులు వరుసగా భూకబ్జాలకు గురవుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో భూకబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం గ్రామం, సర్వే నెంబర్–29లో ఉన్న సుమారు 26 ఎకరాలు 50 సెంట్ల విస్తీర్ణంలో గల ఎర్ర చెరువు కొంత భాగాన్ని కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అక్రమాలకు సంబంధించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక గల కారణాలు ఏమిటన్నది అర్థం కావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఎర్ర చెరువును కబ్జాల నుంచి రక్షించేందుకు హద్దులు గుర్తించి సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేసినా, వాటిని పట్టించుకోకుండా కొందరు అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఆక్రమణల వెనుక స్థానిక టీడీపీ నాయకుడి కనుసన్నలతోనే అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.50 లక్షలకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు మౌనం వహించడం వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి, ఎర్ర చెరువును పూర్తిగా కబ్జాల నుంచి విముక్తం చేసి, ప్రభుత్వ భూములను రక్షించాలని పలాస మున్సిపాలిటీ వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News