నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. చైనా సరిహద్దుల్లోని రుసువా జిల్లాలో భోటేకోశి నది ఉప్పొంగడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ వరదల్లో వందలాది మంది గల్లంతుకాగా.. వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించడం కలకలం రేపుతోంది. వరదల ధాటికి రహదారులు, గ్రామాలు కొట్టుకుపోగా.. 10కి పైగా జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భోటేకోశి నది టిబెటన్ హిమాలయ ప్రాంతంలో ఉద్భవించి నేపాల్ మీదుగా ప్రవహించి సుంకోశి నదిలో కలుస్తుంది. ఈ నదులన్నీ కలిసి కోషి నదీ వ్యవస్థగా మారతాయి. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే కోషి నదిని “బీహార్ దుఃఖదాయిని” అని పిలుస్తారు. ప్రస్తుతం నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా నదీ ప్రవాహం పెరుగుతుండటంతో బీహార్‌లోని దిగువ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నేపాల్ వరదల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం సామ్రాట్ చౌదరి సీఎస్, డీజీపీలతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గండక్, నారాయణి నదుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.









