అనుమతుల్లేని లారీ పట్టివేత..
మీడియా వెళ్లిన కాసేపటికే తరలింపు..
పది రోజులుగా సాగుతోందన్న ఆరోపణలు
అధికారుల తీరుపై సందేహాలు..
వై7 న్యూస్ నిఘా టీం : ములుగు జిల్లాలో జీరో ఇసుక దందా మళ్లీ ఊపందుకుందా? గుట్టు చప్పుడు కాకుండా అధికారుల అండదండలతోనే దందా మళ్లీ కోనసాగుతుందా అంటే ఏజెన్సీ ప్రాంతంలో అవుననే సమాదానం వ్యక్తం అవుతుంది. మంగపేట మండల పరిధిలో ఇసుక ర్యాంపుల నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న ఆరోపణలు తాజాగా కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం మంగపేట మండల పరిధిలోని ఓ ఇసుక ర్యాంపు నుంచి వస్తున్నట్లు సమాచారం ఉన్న లారీని ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు లేనీ ఆ లారీని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకుని లారీని ప్రత్యక్షంగా పరిశీలించారు. లారీ ఏ ర్యాంపు నుంచి వచ్చింది? ఇసుక రవాణాకు అనుమతి ఉందా? పత్రాలు ఏవి? అనే వివరాలపై ఆరా తీస్తుండగానే కొద్దిసేపటికే లారీ అక్కడ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టుకున్న వాహనాన్ని నిబంధనల ప్రకారం సీజ్ చేశారా? లేక మరేదైనా ప్రక్రియలో భాగంగా తరలించారా? అన్నది అధికారులే స్పష్టం చేయాల్సి ఉంది.
పట్టారు.. తరలించారు.. కానీ వివరాలేవీ?
లారీని పట్టుకున్న విషయం వాస్తవమేనని అటవీశాఖ ఎఫ్‌డీవో తెలిపినట్లు సమాచారం. అనంతరం టీజీఎండీసీ, పోలీస్‌శాఖకు అప్పగించినట్లు కొంతమంది మీడియా ప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది. అయితే లారీని ఎప్పుడు, ఎక్కడ, ఏ అధికారిక పత్రాలతో అప్పగించారన్నది వెల్లడికాలేదు. వివరాల కోసం ములుగు టీజీఎండీసీ పీవో, ఏటూరునాగారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్‌ను మీడియా ప్రతినిధులు సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లభించలేదు. ఇదిలా ఉండగా పట్టుబడిన లారీకి సంబంధించి స్థానికంగా పలు ప్రచారాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అనుచరులకు లారీ సంబంధం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. సదరు లారీకి సంబంధించిన పర్మిట్, ర్యాంపు వివరాలు, ఇసుక లోడ్–రవాణా అనుమతులు, పట్టివేత అనంతరం తీసుకున్న చర్యలను అధికారులు వెల్లడిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
పది రోజులుగా దందా సాగుతోందా?
మంగపేట మండల పరిధిలో గత పది రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ర్యాంపుల నుంచి బయలుదేరే ప్రతి లారీకి అనుమతులు, రవాణా పత్రాలు తనిఖీ చేస్తున్నారా? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు అక్రమ ఇసుక రవాణా వెనుక నెలవారీ మామూళ్ల వ్యవహారం ఉందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పట్టుబడిన లారీ వ్యవహారంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. జీరో ఇసుక రవాణాపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి మంగపేట పరిధిలోని ర్యాంపులు, లారీల రవాణా పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తేనే అసలు పరిస్థితి తేలనుంది.








