కొత్తగూడెం , ఆగస్టు 27 (Y7 న్యూస్): ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి, అనంతరం అధిక మొత్తాలను వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హెచ్చరించారు.
ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు విధానం తదితర అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో బెదిరింపులు, వేధింపులకు పాల్పడే వ్యక్తులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.
ఉద్యోగాల పేరుతో మోసాలకు చెక్
మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను నమ్మించి డబ్బులు వసూలు చేసే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ముందస్తుగా డబ్బులు అడిగే వ్యక్తులను నమ్మవద్దని, ఉద్యోగాల కోసం ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయవద్దని తెలిపారు.
ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, ఖాళీలు, నియామక ప్రక్రియ వంటి వివరాలను సంబంధిత సంస్థల అధికారిక మార్గాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని సూచించారు.
అలాగే ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.
సమాచారం ఉంటే పోలీసులకు చెప్పండి
అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారు, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలను ఆర్థికంగా దోచుకోవడం, మోసాలకు పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.








